శ్రీరామ భక్తాగ్రేసరులు, వాగ్గేయకారులు, భజన సంప్రదాయ పరిచయకర్త అయిన శ్రీ రాజా తూము లక్ష్మీనరసింహదాసు వారి వంశం లో జన్మించినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాము. వారి 8వ తరం వారసులమైన మేము తాతగారి ప్రాశస్త్యంను ప్రపంచం నలుమూలలకు వ్యాపింపజేయాలని ఉద్దేశంతో, భద్రాచలంలోని స్థానిక నాలుగు కుటుంబ సభ్యులం(భద్రాచలం చోడవరం ఎటపాక నెల్లూరు) కొందరం కలిసి మన సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ప్రపంచ నలుమూలల ఉన్నటువంటి తూము వంశస్తులందరినీ కూడా మా సంస్థలోనికి సాధరంగా ఆహ్వానిస్తున్నాం.
* వాగ్గేయ కారులు చాలామంది ఉన్నారు కానీ భజన సంప్రదాయానికి సంబంధించిన ఏకైక వాగ్గేయకారులు రాజా శ్రీ తూము లక్ష్మీనరసింహదాసు వారు మాత్రమే అని తెలపడానికి చాలా గర్విస్తున్నాము. భజన సంప్రదాయము కనుమరుగవుతున్న ఈ తరుణంలో, పరిరక్షించవలసిన అవసరం చాలా ఉంది.దాసు వారి ప్రస్థానం భద్రాచల దేవస్థానం నుండి కొనసాగినది. కావున వారి స్థానము నుండే మనం కూడా వారి ఉనికిని కాపాడేందుకు సమిష్టిగా కృషి చేసి దాసు వారి ప్రాముఖ్యతను చాటి చెప్పాలని మా ఈ చిన్న ప్రయత్నం.
భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో జరిపించే రాజా శ్రీ తూము నరసింహ దాసు వారి జయంతి ఉత్సవంలో మన వంశస్థులు మరియు భక్తులతో పాల్గొని జయంతి ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నాo. వారి జయంతి పురస్కరించుకొని ఆరోజు దేవస్థానంలో జరిగే ప్రతి సేవ ను కూడా దాసు వారి పేరున జరుగుతుంది.
గత కొన్ని సంవత్సరములుగా మన కుటుంబ సభ్యులు దేవస్థాన కార్యక్రమాలలో పాల్గొని వారి సహకారంతో మన కుటుంబ సభ్యులు కూడా శాస్త్రీయ సంగీత కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది 2019 నుండి సంస్థను స్థాపించి , పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు భక్తులు వచ్చే దాసు గారి జయంతి ఉత్సవములలో చురుకుగా పాల్గొంటున్నారు. 2022 లో సంస్థ రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది. దాసువారి జయంతి రోజున భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం మరియు మన సంస్థ సభ్యుల చే జరిపే కార్యక్రమాలు.
* నరసింహదాసు వారి జయంతి రోజున ఉదయము "గిరి ప్రదక్షిణ" మేళ తాళాలతో, భజనలతో, వేద పఠనంతో,మరెన్నో రకరకాల సేవలతో వైభవంగా చేస్తున్నాము. దాసువారు దేవస్థానానికి ఎన్నో ఎనలేని సేవలు, కైంకర్యాలు చేశారు. మనము కూడా వారి వంశస్థులుగా కలిసి మరిన్ని సేవలను దేవస్థానానికి అందజేసి శ్రీరాముని సేవలో తరిద్దాము.
* దాసు వారి జయంతి పురస్కరించుకొని దేవస్థానంలో వేద పండితులు ,అర్చకులు, సిబ్బందికి సత్కారములతో గౌరవించుకుంటాం.
* దాసు వారు ఎంతో ఇష్టంగా నిర్వహించిన" తదియారాధన"సంప్రదాయమును కొనసాగించాలని ఆలోచనతో వారి జయంతి రోజున దేవస్థానం అర్చకులు, వేద పండితులు వారి కుటుంబ సభ్యులకు "తదియారధన" కూడా చేస్తున్నాము.
* వేదపండితులచే రాజా శ్రీ తూము నరసింహ దాసు వారి కుటుంబ సభ్యులకు భక్తులకు వేదాశిర్వచనం ఇస్తున్నారు.
* భద్రాచలం దేవస్థానం సమన్వయంతో ఆ రోజు సాయంత్రం శాస్త్రీయ సంగీత కళాకారులచేత "కీర్తనార్చన " లు నిర్వర్తిస్తున్నాం. దాసువారిసేవలను పునఃస్మరిస్తున్నాం.
శ్రీ రాజా తూము నరసింహ దాసు సంస్థ కొన్ని ముఖ్య దిశా నిర్దేశాలతో స్థాపించబడినది.
* భజన సంప్రదాయాన్ని పునర్జీవనం చేయడం.
* రాజా శ్రీ తూము నరసింహ దాసు సంకీర్తన లను ప్రపంచమంతా వ్యాప్తి చేయడం.
* శ్రీ భద్రాచల సీతారామచంద్ర దేవస్థాన అధికారులుగా, భక్తుడిగా రాజా శ్రీ తము నరసింహాదాసు వారు చేసిన సేవలను అందరికీ తెలిసేలా ప్రచురించడం.
* శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం వారి సమన్వయంతో రాజా తూము ము నరసింహాదాసు వారి జయంతి ఉత్సవము జరిపించడం.
* రాజా శ్రీ తూము నరసింహ దాసు సంస్థ ద్వారా పేద విద్యార్థులకు. వెనుకబడిన కళాకారులకు చేయూతనివ్వడం.
* శ్రీరామనవమి వైకుంఠ ఏకాదశి పర్వదినములలో భద్రాచల దేవస్థానంలో సేవలకు భక్తులను ఏర్పాటు చేయడం, మంచినీరు మజ్జిగ పంపిణీ చేయడం.
* రాబోయే సంవత్సరాలలో కుటుంబ సభ్యులు మరియు భక్తులు సహకారంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించే ఆలోచనలు చేస్తున్నాం.